
‘పోలీసులు బాధితుల పక్షాన నిలవాలి’
నారాయణ పేట క్రైమ్: ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం పెరుగుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. పదోన్నతి పొందిన ఏఎస్‌ఐ బి.బాలస్వామి మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలస్వామికి ఎస్పీ వన్ స్టార్‌ను అలంకరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి ఉద్యోగ జీవితంలో ఓ మైలురాయి అని, విధుల్లో మరింత బాధ్యత పెంచుతుందన్నారు. అలాగే పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకం కలిగించడంతో పాటు వారికి అండగా మనమున్నామనే ధైర్యం కల్పించాలని సూచించారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం పీయూలో ఎన్విరాల్‌మెంటల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఫస్ట్, సెకండియర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో పర్యావరణం ప్రధానమైనదని, దానిపై విద్యార్థులు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విభాగం విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తుందని, వాటిలో వచ్చే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఓడీ శివకుమార్‌సింగ్, శ్రీనివాసులు, కోమలి, రాణెమ్మ, బృందాదేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టోర్నీలో
చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్‌లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బాలికల జూనియర్ ఫుట్‌బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారిక, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్.
సాధారణ ప్రసవాల
సంఖ్య పెంచాలి
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్‌ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ, ఆశాల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మురుగు నీటికుంటలు, వర్షపునీరు నిల్వ ప్రదేశాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించి రసాయనాలను పిచికారీ చేయాలని కోరారు. గర్భిణుల నమోదు, హైరిస్క్ కేసులు గుర్తించాలని, ప్రసవానంతరం తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. మంజుల, డీడీఎం వెంకటకృష్ణ, మండల వైద్యాధికారి డా. ఫయాజ్ అహ్మద్, డా. మానస తదితరులు పాల్గొన్నారు.