
పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
నారాయణపేట: మున్సిపల్ అధికారులు పనితీరుపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అనుకూలంగా పనిచేస్తున్నా, కొందరు అధికారులు పనులు చేయడం లేదని పనితీరు మార్చుకోవాలని లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం సరిగ్గా నిర్వహించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, వీధి లైట్లు అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని కమిషనర్‌కు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా చేయాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలు తొలగించాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి మరీ నల్లా బిల్లులు చెల్లించాలని ప్రజలను బలవంతం చేయొద్దని సూచించారు.
నాయకులను కలుపుకొని పోవాలి..
ఇదిలాఉండగా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీంతోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ.. కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పనులు చేపట్టడంలేదని, ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే వార్డుల్లో అధికారులు మార్క్ అవుట్ లో ఇస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న గృహాలకు నెంబర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నాయకులను కలుపుకొనిపోవాలని, తప్పనిసరిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చి ఇళ్ల గ్రౌండింగ్ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమస్యలన్నీ నెల రోజుల్లో అధికారులు పరిష్కరించాలలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, ఇంజనీర్ మహేష్, అధికారులు శ్రీనివాస్,లకి్‌ష్మ్ నర్సింహ, చెన్న కేశవులు, నాయకులు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, నాయకులు గందే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.