
ఇసుక తరలించే ప్రయత్నాలు మానుకోవాలి
మాగనూర్: ప్రభుత్వం,అధికారులు గ్రామస్తుల, రైతుల అంగీకారం లేకుండా ఇసుక తరిలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలను సైతం లేక్క చేయమని అధికారులకు మాగనూర్ రైతులు గ్రామస్తులు హెచ్చరించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పైపుల తయారీ కోసం ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఆయన మాగనూర్ గ్రామ సమీపంలోని హెన్‌హెచ్–167 వంతెన పక్కనే ఇసుక తరలించేందుకు స్థానిక రెవెన్యూ అధికారుల సహయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఇక్కడ ఇసుక తరలిస్తే ఊరుకోం అన్ని ఈ నెల 27వ తేదీన వాగులోకి వచ్చిన యంత్రాలను టిప్పర్లను అడ్డగించి తిప్పి పంపించారు. అయినా అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే ఇసుక తరలించేందుకు సోమవారం పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు అధికారులు గ్రామస్తులను కాదని ముందుకు వెళితే మరో లగచర్ల, గద్వాల జిల్లాలోని ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. దీంతో అధికారులు తహసీల్ధార్ కార్యాలయంలో గ్రామస్తులు, రైతులతో శాంతి చర్చలు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం అందరి సహకారం ఉండాలని తహసీల్ధార్ నాగలక్ష్మి, సిఐ రాంలాల్ కోరారు. గ్రామ సమీపంలో ఇసుక తరలిస్తే రైతుల పొలాలు ఎండిపోవడంతో పాటుగా గ్రామస్తులకు తాగునీరు లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. మాగనూర్ మండలంలో పెద్ద వాగు ఇటు నేరడగం నుంచి అటు మందిపల్లి వరకు చాలా ప్రాంతాల్లో ఇసుక లభ్యం అవుతుందని అక్కడ నుంచి తరలించుకోవాలని సూచించారు. కాదని ఇక్కడే ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు పోయినా పిడికెడు ఇసుక కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. చేసేది లేక పనులకు కావాల్సిన ఇసుకను వర్కూర్ గ్రామం నుంచి 80 శాతం తరలిస్తామని తెలిపారు. మిగిలిన 20 శాతం ఇసుక సమయం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తరలించాలనే విషయంపై మేం నిర్ణయం తీసుకుంటామని తహసీల్ధార్ తెలిపారు. ఈ సమావేశంలో మాగనూర్ గ్రామస్తులు, రైతులు , రెవెన్యూ అధికారులు, పోలిసులు తదితరులు ఉన్నారు.