
మళ్లీ పగిలిన మిషన్ భగీరథ పైపులైన్
మరికల్: మన్యంకొండ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుంచి జిల్లాకు నీరు అందించే ప్రధాన పైపులైన్‌కు మరమ్మతు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే మళ్లీ పగిలింది. మరికల్, అప్పంపల్లి మధ్య తరచు లీకేజీ అవుతున్న ప్రధాన పైపులైన్‌ను మరమ్మతు చేయడం కోసం మిషన్ భగీరథ అధికారులు 36 గంటల సమయం తీసుకొని సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఆదివారం రాత్రి వరకు మరమ్మతులు పూర్తి కావడంతో అదే రాత్రి మన్యంకొండ గ్రిడ్ నుంచి నారాయణపేట జిల్లాకు నీటిని వదిలారు. అలా నీటిని వదిలిన గంట వ్యవధిలోనే మరికల్ శివారులో లీకేజీకి మరమ్మతు చేసిన ప్రదేశంలోనే మళ్లీ పైపులైన్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున పత్తి పంటల్లో నీరు వరదలా ప్రవహించడంతో చాకలి రాజు 3 ఎకరాల్లో సాగు చేసిన పత్తి మొక్కలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో రూ. 50 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాకు మళ్లీ నీటి సరఫరా నిలిచిపోవడంతో పైపులైన్ మరమ్మతులు పనులు అధికారులు నాసీరకంగా చేస్తున్నారనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.