అడ్డాకుల: కందూర్ శ్రీరామలింగేశ్వర క్షేత్రంలో బుధవారం కల్యాణోత్సాన్ని కనులపండువగా నిర్వహించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఆలయంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గ్రామంలో మహిళలు సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులకు కల్యాణ వేడుకను నిర్వహించారు. కారెడ్డి నాగిరెడ్డి, తోకల దామోద్‌రెడ్డిరెడ్డిలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
● ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, కవిత దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వరాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ఆవరణలో ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లు, మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. ఆలయం వద్ద బ్రహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. బ్రహోత్సవాలను విజయవంతం చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్ రావు, నాయకులు అరవింద్‌రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, జగదీశ్వర్, నాగార్జున్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన రామలింగేశ్వరస్వామి ఆలయం
నేత్రపర్వంగా కల్యాణోత్సవం