● 30 తులాల బంగారు, కేజీ వెండి అపహరణ
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటలో భారీ చోరి జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చింతకుంట గ్రామానికి చెందిన వలి కుటుంబీకులు శనివారం రాత్రి ఇంటి తలుపులు వేసుకుని ఇంటి ముందు నిద్ర పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇంటి వెనుక తలుపులు తీసి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగలు, కేజీ వెండి ఆభరణాలతో పాటు రూ. లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఇటీవల వలి రెండో కూతురు వివాహం జరిగింది. పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతురుతో పాటు పెద్ద కూతురుకు సంబంధించిన బంగారు ఆభరణాలు అన్నీ బీరువాలోనే ఉంచారు. బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


