కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఎల్‌నినో భయపెడుతోంది.. మరో వైపు ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది.. రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచే ఆర్‌బీకేల వారీగా విత్తన పంపిణీ జరిగేది. వర్షాలు పడిన వెంటనే రైతులు విత్తుకునే అవకాశాన్ని లభించేది. చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విత్తన పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
ప్రైవేట్ కంపెనీలపై ఆధారం
సబ్సిడీపై వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. వేరుశనగ సరఫరాకు టెండర్లు నిర్వహించినా ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు అన్ని రకాల విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్) సరఫరా చేస్తోంది. విత్తనోత్పత్తికి ఏపీ సీడ్స్ స్వస్తి పలికి వివిధ ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. ప్రస్తుతం విత్తనాలు లేక కర్నూలులోని ఏపీ సీడ్స్ గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే రైతులు పచ్చిరొట్ట విత్తనాలతో పాటు కంది, వేరుశనగ విత్తుకుంటారు. అవి లేకపోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
రూ.350 కోట్ల వరకు బకాయిలు
రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్‌కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రం కేవలం ఒక కంపెనీ మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో కూడా వేరుశనగ అరకొరగా ఉంది. ఖరీఫ్ సీజన్‌లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో సరఫరా చేసిన వేరుశనగ, ఇతర విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఏపీ సీడ్స్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీసీడ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో వేరుశనగ ఇవ్వలేమని విత్తన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ భీష్మించుకూర్చున్నాయి.
దొరకని పచ్చిరొట్ట విత్తనాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంది. ఫలితంగా పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి ఎక్కువగా సాగు చేస్తారు. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడటానికి జీలుగ, పిల్లిపెసర, సన్‌హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఫలితంగా భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి జిల్లాకు కనీసం 9,232 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ దగ్గర ఒక్క క్వింటం కూడా విత్తనాలు లేవు. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కర్నూలు జిల్లా: ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి,
దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు,
క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని,
కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల
నంద్యాల జిల్లా: డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు


