● కట్టడాల కూల్చివేత చేపట్టిన కాంట్రాక్టర్
● అడ్డుకున్న ప్రజలు
● తాత్కాలికంగా నిలిపివేత
కోవెలకుంట్ల: గుళ్లదూర్తిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనుల్లో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల– జమ్మలమడుగు ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రామం నుంచి వివిధ కాలనీల మీదుగా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి మరో ఆర్‌అండ్‌బీ రహదారి ఉంది. ఈ రహదారి విస్తరణ పనులకు ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోడ్డుకు ఇరువైపులా ఆయా కాలనీలకు చెందిన పలువురు ఇళ్లు, గుడిసెలు, ఇతర కట్టడాలు ఏర్పాటు చేసుకుని కొన్ని ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. రోడ్డు నిర్మాణాల్లో వాటిని తొలగించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ ఇచ్చి ఇళ్లు, ఇతర కట్టడాలను కూల్చివేసేందుకు ప్రొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. ఇట్టె బాల చెన్నయ్య ఇంటిని పూర్తిగా కూల్చివేసి ఇతర కట్టడాలను పడగొట్టే క్రమంలో ప్రజలు అక్కడికి చేరుకుని నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని అధికారుల సమక్షంలో వాటిని పరిశీలించిన తర్వాత కూల్చివేత పనులు చేపట్టాలని అడ్డుకున్నారు. ఒకానొక దశలో కాంట్రాక్టర్, ప్రజల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్ కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆయా కాలనీల ప్రజలు కోవెలకుంట్ల తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు చేరుకుని కూల్చివేత సంఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


