ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిల లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అఽధికార టీడీపీ అండ ఉన్న కొందరు సిబ్బంది యథేచ్ఛగా అవినీతికి పాల్పడి దేవుడి సొమ్ము దోచుకుంటున్నారు. తాజాగా శనివారం పావన క్షేత్రంలో సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 10 కిలోల మేరకు తలనీలాల చోరీకి గురికావడం పలు విమర్శలకు తావిస్తోంది. నవనారసింహ క్షేత్రంలో ప్రధానమైన పావన నరసింహస్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తుల రద్దీ ఉంటుంది. మొత్తం 9 క్షేత్రాల్లో ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారో.. పావన క్షేత్రంలోనే అంత మంది తలనీలాలు సమర్పిస్తారు. అటువంటి ఈ క్షేత్రంలో శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలు కల్యాణ కట్టలో భద్రపరిచారు. మధ్యాహ్న సమయంలో కల్యాణ కట్టను శుభ్రం చేస్తున్న సమయంలో అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా అప్పటి వరకు అక్కడ ఉన్న తలనీలాల మూటలు కనిపించ లేదు. ఈ విషయం అక్కడ ఉన్న సిబ్బంది నాయీ బ్రాహ్మణులను అడిగితే ‘ఇక్కడే ఉంచాం మాకేమి తెలియదు’ అని చెప్పడంతో తలనీలాలు మాయమైన విషయం బయటకు పొక్కింది. విషయం తెలిసిన వెంటనే దిగువ అహోబిలం కార్యాలయం నుంచి అక్కడికి వెళ్లిన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినా ఎటువంటి ఫలితం లేదు. అంతవరకు వందలాది మంది భక్తు లు, పదుల సంఖ్యలో సిబ్బంది, 20 మంది నాయీబ్రాహ్మణులు ఉండగానే తలనీలాలు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న వారందరినీ అధికారులు పిలిచి విచారించగా నాయీ బ్రాహ్మణులు, సిబ్బంది తమకు తెలియదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
పావన క్షేత్రంలో తలనీలాలు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే పూర్తి స్థాయిలో విచారణకు కమిటీ వేశాం. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన సిబ్బందికి మెమోలు జారీ చేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలతో పాటు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం.
– పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి,
అహోబిలం దేవస్థానం


