పాములపాడు: పిల్లలకు మంచిచెడుల గురించి తల్లిదండ్రులు వివరించాలని డీసీపీఓ స్వప్న అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు కిశోర వికాసం, వేసవి సెలవులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులని, పిల్లల స్వభావం గురించి తెలుసుకొని అందుకు తగ్గట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కమిటీలు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో చిన్న పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు, అబ్బాయిలు చిన్న వయస్సులో చేసిన తప్పులను పలు ఉదాహరణలతో వివరించారు. విద్య కెరీర్, మార్గదర్శకత్వం, స్మార్ట్ ఫోన్ వినియోగం, పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండటం, పిల్లలకు గ్రామ సభ, చట్టల పై అవగాహన, ప్రాముఖ్యతల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ సులోచన, ఎస్‌ఐ తిరుపాలు, హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లలిత ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


