బనగానపల్లె: పట్టణంలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులు సిలిండర్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. శనివారం పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ల పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు నాలుగు రోజుల క్రితం ఆందోళన చేశారు. ఈ మేరకు గురువారం డీఎస్‌వో రవిబాబు, ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి ఏజెన్సీ కార్యాలయం, గోడౌన్ తనిఖీ చేశారు. గోడౌన్‌లో 499 సిలిండర్లు ఉండాల్సి ఉండగా 11 ఉన్నట్లు నిర్ధారించారు. గ్యాస్ గోడౌన్ వద్దనే వినియోగదారులు సిలిండర్ల తీసుకెళ్లడం చూసి అవాక్కయ్యారు. బుకింగ్ చేసిన తరువాత 40 – 60 రోజుల వరకు కూడా సిలిండర్ల ఇవ్వడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అయితే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల పంపిణీలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కేవలం జరిమానాతో సరిపెట్టే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని గ్యాస్ వినియోగదారులకు నిబంధనల మేరకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


