హోటళ్లకు గ్యాస్‌ స్ట్రోక్‌ | - | Sakshi
Sakshi News home page

హోటళ్లకు గ్యాస్‌ స్ట్రోక్‌

May 16 2026 1:09 AM | Updated on May 16 2026 1:09 AM

సామాన్యులపై ప్రభావం పెంచిన ధరలను తగ్గించాలి

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు..

ఉద్యోగ రీత్యా, చదువుల కోసం బయట ఉండే బ్యాచ్‌లర్స్‌, హోటళ్లలో తినే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ భారం పడుతుంది. టీ, కాఫీ నుంచి బిర్యానీ వరకు అన్ని ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఇప్పటికే పెంచేశారు. హోటల్‌కు వెళ్లి తినాలంటేనే భయమేస్తుంది.

– కమాల్‌బీ, గృహిణి, నంద్యాల

కమర్షియల్‌ గ్యాస్‌పైన ఒకేసారి రూ.1000 పెంచితే మా లాంటి చిరు వ్యాపారులు ఎలా బతకాలి. కస్టమర్లు రేట్లు పెంచితే రారు. పెంచకపోతే మాకు పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి. తప్పని పరిస్థితిలో ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నాం.

– రమణ, టిఫెన్‌ సెంటర్‌ నిర్వాహకులు, నంద్యాల

నంద్యాల: కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుతో హోటల్‌ రంగం కుదేలవుతోంది. ఈ క్రమంలోనే మధ్య, సామాన్య ప్రజలపై కూడా భారం పడుతోంది. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.993 పెంచేసింది. దీంతో గత నెలలో రూ.2,322 ఉన్న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.3,315కు చేరడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గతంలో ఎన్నడూ లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. అమెరికా, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో నెల రోజులుగా గ్యాస్‌ కొరత ఏర్పడినప్పటికీ క్షేత్రస్థాయిలో కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అకస్మాత్తు గా చమురు ధరలు ఇప్పుడిప్పుడే పెరిగిపోయాయని, కమర్షియల్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచారు. శుక్రవారం పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచడంతో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంపుతో చిన్న, మధ్యతరహా హోటల్‌ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదు సార్లు ధరలు పెరిగాయి. గ్యాస్‌ ధర పెంపుతో ఇప్పటికే వ్యాపారులు వారి ఉత్పత్తుల ధరలు పెంచేశారు. ఈ ప్రభావం పరోక్షంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టిఫిన్లు, టీ, కాఫీలతో పాటు భోజనాలు సైతం 15 నుంచి 25 శాతం పెంచేశారు. బ్లాకుల్లో డొమెస్టిక్‌ సిలిండర్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు కొందరు అల్పాహారం ధరలను విపరీతంగా పెంచేశారు.

వ్యాపారుల ఇబ్బందులు..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరగడంతో దాని ప్రభావం గొలుసు కట్టు చర్యలా అన్ని రంగాలపై పడింది. ధరల పెంపు వల్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.

● గ్యాస్‌ ధర పెరగడంతో హోటళ్లలో టీ, కాఫీ నుంచిటిఫెన్లు, భోజనం ధరల వరకు అన్ని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.

● ఒకే సారి రూ.993 పెరగడం వల్ల ధరలు పెంచితే కస్టమర్లు రారని, పెంచకపోతే పెట్టుబడి కూడా రాదని హోటల్‌ యజమానులు ఆందోళన చెందుతున్నారు.

● అద్దె, కరెంట్‌ బిల్లులు, కూరగాయల ధరలతో పాటు ఇప్పుడు గ్యాస్‌ ధరలు కూడా తోడవడటంలో చిన్నపాటి మెస్‌లు, టిఫెన్‌ సెంటర్లు నడపలేక చాలా మంది వ్యాపారాన్ని మూసివేసే పరిస్థితి నెలకొంది.

● రేట్లు పెంచితే కస్టమర్లు రారనే భయంతో కొందరు వ్యాపారులు ధరలు పెంచకుండా దోసె, వడ తదితర పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం వంటివి చేస్తున్నారు.

● ఖర్చు తగ్గించుకోవడానికి కొందరు నాణ్యత లేని నూనెలు, తక్కువ ధరలకు దొరికే ముడి పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

● గ్యాస్‌ భారం భరించలేక మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిల వైపు వెళ్లాలని మరికొందరు ఆలోచిస్తున్నారు.

దీపం 1,56,945

పీఎంయూ 13,589

సీఎస్‌కే 4313

జనరల్‌ 3,14,320

కమర్షియల్‌ 24,300

నంద్యాల పట్టణంలోని సంజీవనగర్‌ గేట్‌ సమీపంలోని ప్రధాన హోటళ్లలో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్లో నేడు భోజనం రూ.140 నుంచి రూ.160 ధరలు పెంచారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్లో భోజనం రూ.120 నుంచి రూ.160కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 25 శాతం పెంచేశారు.

సామాన్యులు తినే మెస్‌ల్లో భోజనం రూ.80 ఉండేది. ఈ హోటళ్లలో భోజనం రూ.130కి పెంచేశారు. ఇక టిఫిన్స్‌ విషయానికి వస్తే ప్లేట్‌ ఇడ్లీ మొన్నటి వరకు రూ.30 నుంచి రూ.40 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్‌ ఇడ్లీ రూ.50కి విక్రయిస్తున్నారు. దోశ, పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు.

ఒకేసారి రూ.993 పెరిగిన

కమర్షియల్‌ సిలిండర్‌ ధర

రూ.3,315కు చేరిన

19 కేజీల సిలిండర్‌ ధర

ఆహార పదార్థాల ధరలు పెంచిన

హోటళ్ల నిర్వాహకులు

చిన్న చిన్న హోటళ్లు మూత

Advertisement
 
Advertisement
Advertisement