రెండేళ్లుగా చైర్మన్‌ లేని మార్కెట్‌ యార్డు.. | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా చైర్మన్‌ లేని మార్కెట్‌ యార్డు..

May 16 2026 1:09 AM | Updated on May 16 2026 1:09 AM

టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల నుంచి ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డుకు పాలక మండలి కమిటీ నియమించ లేదు. గత సంవత్సరం జనసేన పార్టీకి చెందిన మైలేరు సురేఖను మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు తెలియకుండా చైర్మన్‌ను ఎలా నియమిస్తారు ? జీఓ తెచ్చుకోవడం కాదు? ఎలా బాధ్యతలు స్వీకరిస్తారో చూస్తా .. అని బెదిరించడంతో సురేఖ కనీసం మార్కెట్‌యార్డు వైపు కన్నెత్తిచూసే సాహసం కూడా చేయలేదు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి పోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం గడువు ముగిసేలోగైనా పాలక మండలి కొలువుదీరేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాలకమండలి ఏర్పడితే రైతుల కష్టాలు కాస్త అయినా తీరుతాయని ఆశిస్తున్నారు.

ఆళ్లగడ్డ: వ్యవసాయోత్పత్తుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానం. నియోజకవర్గానికి తూర్పు దిక్కున తెలుగుగంగ, పడమర దిక్కున కేసీ కాల్వ ప్రవహిస్తుండటంతో రైతులు ప్రధానంగా వరి, మొక్క జొన్న, జొన్న, శనగ, మినుము సాగు చేస్తారు. ఈ పంటలపైనే రైతుల ఆర్థిక స్థితిగతులు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో మార్కెట్‌యార్డు సేవలు నిలిచిపోవడంతో రైతులకు శాపంగా మారింది. దీంతో రైతులు దళారులబారిన పడి నష్టపోతున్నారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, మినము, వరి, జొన్న పంట కోతలు పూర్తి కావస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అదిగో ఇదిగో అంటూనే సీజన్‌ ముగుస్తున్నా జాడ లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. నియోజవర్గానికి పక్కనున్న నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె, వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరులో కాస్త ఆలస్యంగా అయినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆళ్లగడ్డలో మాత్రం ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రకటిస్తే మార్కెట్‌లో 1,600 మాత్రమే లభిస్తోంది. ప్రతి రైతు ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున నష్టపోతున్నారు. అలాగే కేంద్రం ఇటీవల ధాన్యానికి ఏ – గ్రేడు క్వింటా రూ. 2,461, సాధారణ రకం రూ.2,441 మద్దతు ధర ప్రకటించింది. రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి దళారులు రూ.1,800 నుంచి రూ.1,900 మించి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ తీరుతో వరి రైతులు క్వింటాకు రూ. 600, మొక్కజొన్న రూ. 700, కందులు రూ. 500, మినుములు రూ. 1300 వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement