మహానంది: మహానందీశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వర స్వామికి బహుళ త్రయోదశి, మహా ప్రదోషం సందర్భంగా గురువారం ప్రదోషకాలంలో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ రవి శంకర్ అవధాని, ఆలయ అర్చకులు మూల స్థానం సుబ్బయ్య శర్మ, హనుమంతు శర్మ ముందుగా గణపతి పూజ, పీఠార్చన, ద్రవ్య పూజలు చేశారు. నందీశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతంతో పాటూ జలాభిషేకం, పాలాభిషేకం పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వర అభిషేకం తిలకించి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు.
నేడు ఆళ్లగడ్డలో పీజీఆర్‌ఎస్
నంద్యాల: ప్రజా వినతులను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీన ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పబ్లిక్ గ్రీవెన్స్ వినతుల పరిష్కారానికి పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో పీజీఆర్‌ఎస్ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు నేరుగా అధికారులను కలిసి తమ అర్జీలు అందజేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు బాలల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికార అధికారిణి లీలావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, దైర సాహసాలు, క్రీడలు, కలల సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, పెయింటింగ్ తదితర అంశాల్లో ప్రతిభ చూపిన వారు జూలై 31వ తేదీలోపు వెబ్‌సైట్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏడాది డిసెంబర్ 26వ బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకుంటారన్నారు.
ట్రాఫిక్ సీఐపై చర్యలు తీసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): ఆటో కార్మికులను వేధిస్తున్న పట్టణ ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నంద్యాల పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ధనంజయుడు, శ్రీనివాసులు కోరారు. సీఐ తీరును నిరసిస్తూ గురువారం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐ చాంద్‌బాషా ఆటో కార్మికులపై దాడులకు పాల్పడుతూ, అధిక మొత్తంలో చలానాలు వేస్తున్నారన్నారు. సీఐను సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రోడ్డు సైడు ఉండే చిరు వ్యాపారులను బెదిరిస్తున్నారన్నారు. ఆందోళనలో ఏఐటీయూసీ నంద్యాల పట్టణ డిప్యూటీ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆటో యూనియన్ నాయకులు బండి శ్రీను, నాగార్జున, రహీమ్, ఏడుకొండలు, రమణారెడ్డి, శ్రీనివాసులు, మధు, నాగేంద్ర పాల్గొన్నారు.
వంద పడకల ప్రభుత్వాసుపత్రి తనిఖీ
డోన్ రూరల్: స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో గురువారం వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుజాత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను తనిఖీ చేసి వసతులు, వైద్య సౌకర్యాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని వారు సూచించారు. ఆమె వెంట, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనీఫ్, డాక్టర్ గౌస్, డాక్టర్ శిల్ప, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.


