రబీ గట్టెక్కేనా..
జిల్లాలో 29,084 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం
నట్టేట ముంచిన ఖరీఫ్
దిగుబడులు చేతికందే తరుణంలో ముంచిన మోంథా
ఎకరాకు 30 బస్తాలకే దిగుబడులు పరిమితం
రబీ సాగుకు సాగునీటి గండం
ఎండకారు వరి సాగు వద్దంటున్న అధికారులు
సాగునీరు ప్రశ్నార్థకం
కోవెలకుంట్ల: రెండేళ్లుగా జిల్లాలో వరి సాగు రైతులకు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర నష్టాలు చవిచూశారు. ఖరీఫ్ వరి కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా రబీ సీజన్ వరిసాగుపై కోటి ఆశలు పెట్టుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలోని 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, తదితర నీటి ఆధారంగా 29,084 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా, షుగర్‌లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోత, నూర్పి డి పనులు పూర్తిగా కాగా వివిధ సాగునీటి వనరుల ఆధారంగా నారు మడులు సిద్ధం చేసుకుని ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలోని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా వరి సాగు సాధారణ విస్తీర్ణం 65,255 హెక్టార్లు. అయితే ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 73,038 హెక్టార్లలో సాగు చేశారు. నారా, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, వరి కోత, నూర్పిడితో కలిపి ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో భారీ వర్షాలకు తోడు మోంథా తుపాన్ ప్రభా వంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు వరి చాలా చోట్ల నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజ తాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవి చూశారు. దిగుబడులు తగ్గగా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ. 2,200 వరకు ధర పలికింది. ఈ ఏడాది మార్కెట్‌లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించి రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఖరీఫ్ కష్టమంతా పెట్టుబడులకే సరిపోవడంతో రైతులకు నష్టాలు తప్పలేదు.
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కుందూనది, పాలేరు, కుందరవాగు పరివాహక ప్రాంతాల్లో వరినారుమడులు సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో ని బండిఆత్మకూరు మండలంలో 6,225 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 3,260, పాణ్యం మండలంలో 2,885, శిరువెళ్ల మండలంలో 2,347, మహానంది మండలంలో 2,335, ఆళ్లగడ్డ మండలంలో 1,732, వెలుగోడు మండలంలో 1,628, గోస్పాడు మండలంలో 1,107, అవుకు మండలంలో 1,080 హెకార్టలలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. అయితే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గు ముఖం పట్టడంతో రాబోయే రోజుల్లో ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కుందూనది, పాలేరు, కుందరవాగుల్లో నీటి ప్రవా హం అంతంత మాత్రంగానే వచ్చే పరిస్థితులున్నాయి. ఎస్సార్బీసీ, కేసీకెనాల్స్ పరిధిలో రబీ వరి సాగు వద్దని ఆ స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులను రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రబీ వరిసాగు సాగునీటి గండం పొంచి ఉండటంతో ఈ ఏడాది రబీ వరిసాగు ఎంత మాత్రం కలిసోస్తుందో వేచి చూడాల్సిందే.
ఈ ఏడాది రబీ సీజన్‌లో రెండున్నర ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుకు నారుమడి సిద్ధం చేసుకున్నాను. గతేడాది రబీ సీజన్‌లో రెండు ఎకరాల్లో వరి సాగు చేయగా ఎకరాకు 18 బస్తాల దిగుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కుందూనది పరివాహకంలో నంద్యాల సోనా రకానికి చెందిన వరి సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నాను. ఈ ఏడాది సాగునీరు, వాతావరణం అనుకూలిస్తుందని భావిస్తున్నాను. – ప్రతాప్‌రెడ్డి, రైతు,
భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం


