పిల్లలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి
కర్నూలు: బలహీనవర్గాల పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం స్నేహపూర్వక పథకం–2024 ఏర్పాటైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు, ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాల పిల్లలు, దివ్యాంగ పిల్లలు స్నేహపూర్వక పథకంతో లబ్ధి పొందుతారన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100, పిల్లల హెల్ప్‌లైన్ నెంబర్ 1098 గురించి కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వివరించారు. పిల్లలకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్, డీఈఓ శామ్యూల్‌పాల్, కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా, లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజయనిర్మల, ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్ హెడ్‌మాస్టర్ హుసేన్, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.


