‘రోళ్లపాడు’ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆత్మకూరురూరల్: వెలుగోడు రేంజ్ పరిధిలోని రోళ్లపాడు బట్టమేక పక్షి అభయారణ్యం అభివృద్ధి, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆత్మకూరు డివిజన్ టైగర్ ప్రాజెక్ట్ డీడీ విఘ్ఘేష్ అపావ్ అన్నారు. అభయారణ్యం సమావేశ హాల్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణుల పరిరక్షణ, ఆవాస ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై వారు చర్చించారు. అభయారణ్య సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు వివిధ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ అధికారులు నరసింహారెడ్డి, వంశీ కృష్ణ, రాకేష్, గ్రీన్ కో శరత్, సబ్ డీఎఫ్‌ఓ బబిత తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జేవీసీ ఆగ్రో కెమికల్స్‌లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, ఇన్‌వాయిస్‌లను తనిఖీ చేశారు. యూరియా, డీఏపీల భౌతిక నిల్వలు, ఈపాస్ మిషన్లలో ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. అదే విధంగా ఎరువుల స్టాక్‌లను రిటైల్ డీలర్లకు వేసిన బిల్లులను తనిఖీ చేశారు. అనంతరం డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల, పురుగు మందుల యజమానులు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్న ఎరువులు, పురుగు మందులు మాత్రమే అమ్మాలన్నారు. స్టాక్ బోర్డులో ప్రతి రోజు అప్‌డేట్ చేయాలని, ఎరువులు కొన్న ప్రతి రైతుకు బిల్లు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల అభివృద్ధ్దికి
పాలనా అనుమతులు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.156.64 కోట్లతో 71 రహదారుల పనులు చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 115.409 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.62.67 కోట్లతో 27 పనులు మంజూరైనట్లు చెప్పారు. అలాగే నంద్యాల జిల్లాలో 178.110 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.93.97 కోట్లతో 44 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనల మేరకు ఆయా రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చాయని ఎస్‌ఈ వివరించారు. త్వరలోనే రెండు జిల్లాల్లో పాలనా అనుమతులు లభించిన రోడ్ల పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.
పెరిగిన చలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంచు కూడా కురుస్తోంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 15–16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు చలి తగ్గని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈశా న్యం దిశగా గాలులు గంటకు 3 నుంచి 4 కిలో మీటర్ల వేగంతో విస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 16.17 డిగ్రీల వరకు నమోదు అవుతాయని ప్రకటించారు.
మహానంది: నల్లమల అటవీ ప్రాంతాల్లో చలి చంపేస్తుంది. రాత్రి చీకటి పడితే చాలు మంచు కురుస్తుంది. సాయంత్రం నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మంచు దుప్పటి కప్పేస్తుంది. ఈ క్రమంలో మంచు, చలితో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారు జాము నుంచే చలి మంటలు వేసుకుంటున్నారు.
నేడు ‘డయల్ యువర్ ఎస్‌ఈ’
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్‌లో ఈ నెల 10న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్ ఫోన్ చేసి చెప్పవచ్చని పేర్కొన్నారు.


