పీఎం సూర్య ఘర్ పథకంలో పురోగతి పెంచాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో జిల్లాలో అంచనాల మేరకు పురోగతి సాధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీఈలు, ఈఈలతో పీఎం సూర్యఘర్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలన్నారు. వెండర్ ఎంపిక (కమిషన్) పూర్తయిన దరఖాస్తులను ఆగకుండా వెంటనే పూర్తి చేసి, లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. తక్కువ శాతం పురోగతి ఉన్న నంద్యాల, రుద్రవరం, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, బనగానపల్లె (రూరల్), ఆత్మకూరు (రూరల్), శ్రీశైలం, ప్యాపిలి మండలాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.


