రబీలోనూ యూరియా కష్టాలు
జూపాడబంగ్లా: రబీ సీజన్‌లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని 80 బన్నూరు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సొసైటీకి ఇప్పటిదాకా 42 టన్నుల యూరియా మంజూరు కాగా రెండు రోజుల క్రితం 20 టన్నుల యూరియా సరఫరా అయింది. ఉదయం 9 గంటలకు చేరుకున్న రైతులు పాసుపుస్తకాలను వరుసలో పెట్టి సాయంత్రం దాకా పడిగాపులు కాశారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఎరువులు అందుతున్నాయని సన్న, చిన్నకారు రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారిందని రైతులు విమర్శించారు. సొసైటీకి మరో 48 టన్నుల యూరియా సరఫరా కోసం ప్రతిపాదనలు పంపినట్లు సొసైటీ సీఈఓ చంద్రశేఖర్‌గౌడు, ఏఓ కృష్ణారెడ్డి తెలిపారు.


