అను‘మతిలేని’ పని.. ‘బహుళ’ అవినీతి
బొమ్మలసత్రం: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని రకాల పనులను అధికారుల ద్వారా చేయిస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన ఒక వ్యాపారి లంచావతారం ఎత్తారు. ఆయన డబ్బు ఇవ్వందే ప్రజలకు ఎలాంటి పనులు జరగటంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నంద్యాల జిల్లాగా మారినప్పటి నుంచి శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గతంలో ప్రజలు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్లి ఒక్కపైసా లంచం లేకుండా పనులు పూర్తి చేసుకునేవారు. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని స్థలాలకు పన్నులు వేయించుకునే దగ్గర నుంచి భవనాలకు అనుమతులు పొందే వరకూ లంచాలు ముట్టజెప్పలేక విస్తుపోతున్నారు. నంద్యాల మున్సిపాల్టీని టీడీపీకి చెందిన బడా వ్యాపారి దత్తత తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. మున్సిపాల్టీ పరిధిలో బహుళ అంతస్తుల భవనా లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ఆయన అనుమతులు ఉండాల్సిందే. ఆయనకు మంత్రి అండదండలు మెండుగా ఉండటంతో అధికారులు కీలుబొమ్మలా మారారనే విమర్శలు ఉన్నాయి.
ఆయన చెబితేనే అనుమతులు
నంద్యాల పట్టణం కొన్నేళ్లుగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గత ప్రభుత్వంలో చిన్న భవన నిర్మాణం నుంచి బహుళ అంతస్తుల నిర్మాణాల వరకూ అన్నీ వార్డు సచివాలయాల నుంచే పారదర్శకంగా జరిగేవి. అధికారులకు ఒక్క పైసా లంచం ఇవ్వకుండానే భవనాలకు అనుమతులు సులభంగా లభించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. కూటమి నేతలు చెప్పన వారికి మాత్రమే అధికారులు సచివాలయాల ద్వారా అనుమతులు ఇస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెప్పకపోతే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుని దరఖాస్తును కూడా ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయలేని పరిస్థితి నెలకొంది. మంత్రి అండదండలతో మున్సిపాల్టీని తన అధీనంలోకి తెచ్చుకున్న ఆ వ్యాపారి అనుమతి తర్వాతే నిర్మాణాలకు అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ వ్యాపారి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతలకు కొంత మొత్తాన్ని ఖర్చు చేశాడని, దానిని సంపాదించుకునేందుకు మున్సిపాల్టీని దత్తత ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ నుంచి కాంట్రాక్టర్ వరకూ
గతంలో కేవలం రియల్ ఎస్టేట్ , షాపింగ్ కాంప్లెక్స్ బిల్డర్‌గా ఎదిగిన ఆ వ్యాపారి నేడు కాంట్రాక్ట్ పనులు కూడా చేపడుతున్నాడు. నంద్యాలలోని ప్రధాన రహదారి పనులు పూర్తి చేశాడు. ఇందుకు సన్మానం అందుకున్నాడు. ఇదే క్రమంలో మరికొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఆయన నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపాల్టీ ద్వారా చేసిన పనులకు అధికారులు బిల్లులు నిలిపివేశారు. అయితే ఆయన చేసిన పనులకు మాత్రం అధికారులు త్వరగా బిల్లులు సిద్ధం చేసి మంజూరు చేస్తున్నారు.
ఒక వ్యాపారికి అమాత్యుడి
అండ‘దండ’
ఆయన మాట అధికారులు
వినాల్సిందే!
ముందుకు సాగని భవననిర్మాణాలు
నంద్యాలలో ప్రజలకు తప్పని
తిప్పలు


