
వేటగాళ్ల అడ్డ్డుకట్టకు త్రిముఖ వ్యూహం
ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మృతితో అటవీశాఖలో కదలిక
మూడు శాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలకు ప్రణాళిక
ఆత్మకూరురూరల్: నల్లమలలో ఇప్పటికే వేటగాళ్ల ఉచ్చుకు అరుదైన వన్యప్రాణాలు ఎన్నో బలయ్యాయి. వాటిలో పెద్దపులులు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు నార్త్ బీట్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డారు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు వేసిన విద్యుత్ తీగల ఉచ్చుకు ఏకంగా స్ట్రయికింగ్ ఫోర్స్‌లో పని చేస్తున్న ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్ నాయక్ బలి కావడంతో వేటగాళ్లకు చెక్ పెట్టేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. వన్యప్రాణుల మాంసంతో వ్యాపారం చేస్తున్న వేటగాళ్లకు చెక్ పెట్టేందుకు తెరపైకి త్రిముఖ వ్యూహాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ, ఎక్సైజ్, పోలీసు శాఖలు సమన్వయంతో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీ, ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ కలసి ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసు ఇంటెలిజెన్స్ సమాచారంతో అటవీ సమీప గ్రామాల్లో అక్రమ ఆయుధాలు కలిగిన వారి ఆచూకీ తెలుసుకుని, ఆ ఆయుధాలు సీజ్ చేయడం, వన్యప్రాణుల వేటకు ఒక ముసుగుగా, సహ వ్యాపారంగా ఉన్న నాటుసారా దందాపై ఉక్కుపాదం మోపడం, అటవీ శాఖ సిబ్బందిని పెంచి నిఘా కట్టుదిట్టం చేసే అంశాలపై ముందుకెళ్లేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిసింది. వేటగాళ్లు ఉచ్చుకు ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన బానకచర్ల ప్రాంతంలో ఒక బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతం నుంచి గతంలో ఒక పెద్ద పులి అడవి బయటకు వచ్చి వివిధ గ్రామాల పరిధిలో 25 కిమీ మేర సంచరించి తిరిగి అడవిలోకి వెళ్లినట్లు అధికారులు ట్రాక్ చేసి రికార్డు చేసిన విషయం తెలిసిందే. అంతే కాక ఇక్కడ గతంలో ఒక చిరుత పులి ఉచ్చులో చిక్కు కోగా దాన్ని రక్షించి అడవిలోకి పంపారు. ముఖ్యమైన రక్షిత వన్య ప్రాణులు సంచరించే ప్రాంతం కావడంతో ఈ ఏర్పాట్లకు అటవీ శాఖ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ శాఖపై కేసులు
అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసిన అంశాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారు లు గుర్తించారు. లక్ష్మణ్ నాయక్ మృతి చెందిన ఘటన లో బానకచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్ లైన్లకు అనుమతులు లేవని అటవీ అధికారుల విచారణలో తేలింది. ఈ విషయంపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు అటవీ శాఖ నుంచి నోటీసులు పంపారు. వెంటనే అనుమతి లేని విద్యుత్ లైన్లను తొలగించక పోతే కేసు లు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో వేటగాళ్లు..
బానకచర్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు వేసి ప్రొటెక్షన్ వాచర్ మరణానికి కారణమైన వన్యప్రాణి వేటగాళ్లను ఆత్మకూరు రూరల్ సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వశనీయ సమాచారం. మిడుతూరు మండలం తలముడిపికి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. తలముడిపికి చెందిన వేటగాడు వన్య ప్రాణుల వేటను జీవనోపాధిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిందితుడు పెద్దగా అటవీ శాఖ నిఘా ఉండని ఎర్రమల ప్రాంతాల్లో అడవి పందులు, జింకలకు ఉచ్చులు వేసి మాంసం విక్రయిస్తూ వచ్చాడు. ఈ దందాను క్రమేపి నల్లమల ప్రాంతాలకు కూడా విస్తరించాడు. వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాలలోని కొందరు వ్యక్తులను కలుపుకుని ముఠాగా ఏర్పడి ఈ దందాను సాగిస్తున్నట్లు తెలిసింది.