
డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు
కర్నూలు(అగ్రికల్చర్): డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు ఏమాత్రం సరికాదని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ విడుదల చేస్తూ జారీ చేసిన జీవో ఆర్‌టీ నెంబర్ల 60, 61పై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెరిగిన డీఏ అక్టోబర్ నెల వేతనంతో కలిపి నవంబర్ నెలలో చెల్లిస్తారని, సంప్రదాయం ప్రకారం అరియర్స్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ప్రావిడెండ్ ఫండ్(జెడ్పీపీఎఫ్)లో కలపాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు 21 నెలల అరియర్స్ డీఏ ఆ విధంగానే కలుపుతార ని భావించామన్నారు. అయితే జీపీఎఫ్‌లో కాకుండా పదవీ విరమణ తర్వాత ఇస్తామని జీవోలో పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వీస్‌లో ఉండి మరణించిన వారికి, పెన్షనర్లకు డీఏ అరియర్స్ 2027–28 నుంచి 12 విడతల్లో చెల్లిస్తామనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను ఇప్పటికే ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయన్నారు. త్వరలోనే జీవోల మా ర్పునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, భాస్కరనాయుడు, పి.రామకృష్ణారెడ్డి, ఆర్‌వీ రమణ, వ్యవసాయ ఉద్యోగుల సంఘం, వెటర్నరీ పారా సిబ్బంది సంఘం నేతలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఉన్నారు.