
పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజల శాంతిభద్రత పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు తదితరులు హాజరయ్యారు. ముందుగా పరేడ్ కమాండర్ జి. బాబు నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల వివరాలను ఏఆర్ డీఏస్పీ శ్రీనివాసరావు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్ధవంతంగా అమలు చేసి, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎంతో కష్టసాధ్యమైనదని, ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారన్నారు. . స్వాతంత్య్రం తర్వాత దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ, ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని ఎస్పీ స్పష్టం చేశారు. మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం అత్యంత గర్వించదగ్గ విషయమన్నారు. పోలీసులు సమాజ శాంతి–భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.