
మట్టిపై రాయల్టీ ఎత్తేయాలి
● ట్రాక్టర్ యజమానుల నిరసన
బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం మైనింగ్ రాయల్టీ వసూలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో మట్టిపై కూడా రాయల్టీ వసూలు చేస్తోంది. దీనిని నిరసిస్తూ మంగళవారం సాధుకొట్టం సమీపంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పలుట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ.. జ్వాలాపురం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ సొంత పొలాల్లో ఉన్న మట్టిని పాత మట్టి మిద్దెలకు తరలిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. అయితే కొత్తగా రాయల్టీ పేరుతో మట్టిపై కూడా టన్నుకు రూ.90లు వసూలు చేస్తే ఎలా అంటూ ట్రాక్టర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. తాము మట్టి తరలింపును నిలిపితే కూలీలు కూడా ఉపాధిని కోల్పోతారన్నారు. అధికారులు స్పందించి మట్టిపై రాయల్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, కల్పన వెంటనే ధర్నా వద్దకు చేరుకుని ట్రాక్టర్ల యజమానులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.