
నీ వెంటే నేను..
● భార్య మృతి చెందిన గంటలోనే
భర్త మరణం
● ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి
ప్యాపిలి: దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిచారు. వృద్ధాప్యంలో సైతం అన్యోన్యంగా ఉంటూ కాలం వెళ్లదీశారు. మరణం సైతం వీరిని వీడయలేదు. నీ వెంటే నేనంటూ గంటల వ్యవధిలో ఇద్దరు తనవు చాలించారు. ఈ విషాద ఘటన ఆదివారం ప్యాపిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అరవేటి లక్ష్మీనారాయణ (90), వెంకటలక్ష్మమ్మ (77) దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. వీరికి నలుగురు కుమారులు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఒక కుమారుడు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. మూడో కుమారుడు సతీశ్ తల్లిదండ్రులతో కలసి ప్యాపిలిలో ఉంటున్నాడు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మమ్మలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త లక్ష్మీనారాయణకు సపర్యలు చేస్తూ అతనికి చేదోడువాదోడుగా ఉంటున్న భార్య వెంకటలక్ష్మమ్మ ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందారు. విషయం తెలిసిన భర్త లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపానికి గురై 10.30 గంటల సమయంలో మృతి చెందారు. అరవేటి లక్ష్మీనారాయణ నంద్యాల, నందికొట్కూ రు, మద్దికెర తదితర ప్రాంతాల్లో లైబ్రేరియన్‌గా పని చేసి 1993లో పదవీ విరమణ పొందారు. ఒకే రోజు భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.