
అంతా మీ ఇష్టమేనా?
● సర్పంచ్‌ల డిజిటల్ సిగ్నేచర్లు ఎందుకు ఉంచుకున్నారు?
● అధికారుల పనితీరుపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం
కొలిమిగుండ్ల: ‘గ్రామ పంచాయితీల సర్పంచ్‌లు, పంచాయితీ కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్లు ఎందుకు డిప్యూటీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉంచారు. అంతా మీ ఇష్టానుసారంగా చేస్తారా?’ అని అధికారులపై జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన కొలిమిగుండ్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ పనితీరుపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ఫిర్యాదు చేయగా జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. గత సమావేశంలో మండలంలో ఎక్కడా పందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఏం చేశారని డిప్యూటీ ఎంపీడీఓను ప్రశ్నించారు. నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సమాధానం రావడంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రబీ సీజన్ ప్రారంభమైనా రైతులకు సబ్సీడిపై శనగ విత్తనాలు అందిచరా, యూరియా కూడా ఇవ్వరా’ అని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. కొలిమిగుండ్ల నుంచి పెట్నికోట రోడ్డును నాసిరకంగా వేశారని, పీహెచ్‌సీల్లో సిబ్బంది ఉండటం లేదని సభ్యులు చెప్పగా సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ఇటిక్యాల, కొలిమిగుండ్ల రెవిన్యూ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఇతరత్రా వాటి కోసం స్థలాలు అవసరం అవుతాయని, ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనింగ్ సీనరేజ్ వసూలును ప్రైవేట్‌కు అప్పగించకుండా పాత పద్ధతిలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని, ఈ మేరకు తీర్మానం చేసి పంపాలని సూచించారు.