
22నుంచి శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 21వ తేది వరకు కార్తీకమాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పూజావేళలను మార్పులు చేసి వేకువజామున 4గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు. ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1న కార్తీక శుద్ద ఏకాదశిని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటవుతుందన్నారు. 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ఉంటుందన్నారు. కార్తీకమాసమంతా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.