‘గంపెడు’ నష్టాలు! | - | Sakshi
Sakshi News home page

‘గంపెడు’ నష్టాలు!

Oct 6 2025 2:30 AM | Updated on Oct 6 2025 2:30 AM

‘గంపె

‘గంపెడు’ నష్టాలు!

20 కిలోల టమాట ధర రూ.50

కర్నూలు(అగ్రికల్చర్‌): నిన్న మొన్నటి వరకు ఉల్లి రైతుల కన్నీరు.. ఇప్పుడు టమాట రైతుల వేదన.. కూటమి ప్రభుత్వం రైతన్నల జీవితాలను రోడ్డు పడేస్తోంది. ఆరుగాలం కష్టించినా గిట్టుబాటు ధరలేక రైతులు దిగాలు చెందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు, క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన లేకపోవడంతో రైతు నష్టాలను మూటకట్టుకుంటున్నాడు. టమాట కిలో ధర కనీసం రూ.8లకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతం రూ.2 కూడా దక్కని పరిస్థితి. 20 కిలోల టమాటకు లభిస్తున్న ధర రూ.50 మాత్రమే. టమాటకు మార్కెట్‌లో లభిస్తున్న ధరతో అమ్ముకుంటే కోత, రవాణా చార్జీలు, కమీషన్‌కే సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆస్పరి మండలం బిల్లేకల్‌, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, కర్నూలు మండలం గార్గేయపురంలో టమాట క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్‌ మండలం చింతలపేట టమాట క్రయవిక్రయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆస్పరి, పత్తికొండ, పెద్దకడుబూరు, దేవనకొండ, క్రిష్ణగిరి, హాలహర్వి, హొళగుంద, వెల్దుర్తి, ఓర్వకల్‌, సీ.బెళగల్‌, గూడూరు మండలాలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల మండలాల్లో సాగవుతోంది.

సీఎం ఆదేశాలు బేఖాతరు

రైతులు తెచ్చిన టమాటను హోల్‌సేల్‌గా కిలో రూ.8 కంటే తక్కువకు కొనరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. 25 కిలోల బాక్స్‌ను రూ.50 నుంచి రూ.80 ధరతో కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ధర రూ.2 నుంచి రూ.3 వరకు మాత్రమే పలుకుతోంది. రెండు, మూడు రోజులుగా టమాట ధర మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ధరలు పడిపోయినప్పుడు మార్కెటింగ్‌ శాఖ అధికారులు కిలో రూ.8కి తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఇందుకు అనుగుణంగా వ్యాపారులు ధరలు పెంచారు. నేడు ఈ పరిస్థితి లేకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

భారీగా నష్టపోతున్న టమాట రైతులు

ఉమ్మడి జిల్లాలో 13,500 ఎకరాల్లో సాగు

ధర పడిపోయినా స్పందించని సర్కారు

రూ.8లకు కొనాలనే సీఎం ఆదేశాలు

బేఖాతరు

అనువుగాని చోట టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌

ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్‌కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్‌లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్‌కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు.

ఉమ్మడి జిల్లాలో దాదాపు 13,500 ఎకరాల్లో టమాట సాగయింది. ఈ–క్రాప్‌ బుకింగ్‌ ప్రకారం కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,990 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 3,312 ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్‌ బుకింగ్‌ ఇంకా కొనసాగుతుండటంతో టమాట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఎకరాకు 15 టన్నుల ప్రకారం దిగుబడి వస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన టమాట నుంచి దాదాపు 2 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు 300 టన్నుల టమాట మార్కెట్‌కు వస్తోంది.

‘గంపెడు’ నష్టాలు!1
1/1

‘గంపెడు’ నష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement