
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
నంద్యాల(వ్యవసాయం): రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ.. రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని, అలాగే గిట్టుబాటు ధరల కోసం సమాఖ్య కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నంది రైతు సమాఖ్య రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. రైతులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నా రు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా రైతు సమాఖ్య మరింత కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 ఏళ్ల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మను సత్కరించారు. సమాఖ్య నూతన అధ్యక్షునిగా బీవీ రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, రైతు నాయకులు డాక్టర్ హయాగ్రీవచారి, రామసుబ్బారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామ సుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.