
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకు న్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది.
గోస్పాడు: వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీహెచ్‌సీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. పీహెచ్‌సీల వైద్యులు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. పీహెచ్‌సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంతో కాలంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఓకే క్యాడర్‌లో పని చేస్తున్న సంబంధిత వైద్యులకు ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోగా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రెబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు.
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 29న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్షలు
కర్నూలు (టౌన్): పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షలు ప్రశాంత వాతవరణంలో జరిగాయి. నగరంలోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు కర్నూలులో 261 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఉన్నారు.

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు