
నేడు అశ్వాల పారువేట
● కొనసాగుతున్న యాదవరాజ వంశీయుల సంప్రదాయం ● సైనికులుగా మద్ది కులస్తులు
మద్దికెర: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ రాజ వంశంలోని పెద్దనగిరి, చిన్ననగిరి, యామనగిరి కుటుంబీకులు అశ్వాల పారువేట ఉత్సవాన్ని మూడు శతాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేయడం వీరి ఆచారం. అందులో భాగంగా గురువారం ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నారు.
భోగేశ్వరాలయం నుంచి..
పూర్వం యాదవ వంశాలు రాజ్యాలను ఏలిన విజ యం విదితమే. అందులో భాగంగా ఆయా యాదవ వంశీయుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న గురప్రు స్వారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు, మూడు గుర్రాలను స్వారీకి అనుమతిస్తుండటంతో ఆయా కుటుంబాలు విజయదశమికి నెల రోజుల ముందు నుంచే గుర్రాలు సమకూర్చుకుని శిక్షణ ఇస్తారు. పండుగ రోజు వారు తలపాగ ధరించి రాచరికపు వస్త్రాలతో ఖడ్గాలు ధరించి గుర్రాలపై మేళ తాళాలతో మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలోని బొజ్జనాయినిపేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయానికి చేరుకుంటారు. వీరికి సైనికులుగా ‘మద్ది’ కులస్తులు ఆయుధాలు ధరించి వెంట నడుస్తారు. ఆలయంలోని స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాల స్వారీ ప్రారంభిస్తారు. విజయం సాధించిన వారిని భాజాభజంత్రీలతో మొదట ఊరేగిస్తారు. అనంతరం యాదవ రాజ వంశీకుల కుటుంబాలు గుర్రాలపై ప్రధాన రహదారిలో తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను ప్రజలకు ఎంతో ఆశక్తితో తిలకిస్తారు.

నేడు అశ్వాల పారువేట