సచివాలయ ఉద్యోగులమా.. సర్వే సిబ్బందిమా? | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులమా.. సర్వే సిబ్బందిమా?

Sep 16 2025 8:15 AM | Updated on Sep 16 2025 8:15 AM

సచివాలయ ఉద్యోగులమా.. సర్వే సిబ్బందిమా?

సచివాలయ ఉద్యోగులమా.. సర్వే సిబ్బందిమా?

డిమాండ్లు ఇవి?

● ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి.

● గ్రామ వార్డు సచివాలయం మాతృ శాఖలకు అప్పగించాలి.

● ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కల్పించాలి.

● కార్యాలయ పని వేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాలలో బలవంతపు విధులు చేయించడం తగదు.

● నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.

● ఆరేళ్ల పాటు ఓ కేడర్‌లో సర్వే చేసిన వారికి ఏఏఎస్‌ ప్రకారం స్పెషల్‌ ఇక్రిమెంటు మంజూరు చేయాలి.

● ప్రస్తుతం అమలు అవుతున్న రికార్డ్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు మార్పు చేయాలి.

● అన్ని విభాగాల వారీగా ప్రమోషన్‌ చానల్స్‌ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితా విడుదల చేయాలి.

● గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్టేషన్‌ సీనియార్టీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగే ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలి.

గోస్పాడు: కూటమి ప్రభుత్వ తీరుతో ఆదర్శమైన సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రోజుకో సర్వేల భారంతో సతమతమవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో నిర్వేదానికి గురవుతున్నారు. సర్వేలను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులందరూ సమైక్యంగా ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద ఎంపీడీఓలకు వినతి పత్రాలను అందజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోజుకో కొత్త సర్వేలంటూ సచివాలయ సిబ్బందిపై పని ఒత్తిడి పెంచింది. జిల్లాలోని 29 మండలాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 413 గ్రామ, 103 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. రూ.164.31 కోట్లు నిధులతో సచివాలయాల భవనాలు నిర్మించింది. ప్రస్తుతం 516 సచివాలయాల్లో 4,400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో అప్పట్లో 8,842 మంది వలంటీర్లతో ఇంటింటికీ సేవలు అందించారు. అయితే వలంటీర్లందరికీ ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చి పని చేయిస్తామని కూటమి నేతలు ఊరించారు. 15 నెలల కూటమి పాలన పూర్తయిన కూడా వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో గతంలో వలంటీర్లు చేసే పని కూడా ప్రస్తుతం సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగేలా సర్వేలు చేయిస్తుండటంతో వారు విసుగు చెందుతున్నారు. ఉద్యోగులుగా తాము ఎలా పని చేయాలని, ఒత్తిడి తగ్గించాలంటూ ఇప్పటికే పలుమార్లు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. సెలవు దినాలు, పండుగలు, సైతం ఏమాత్రం వదలకుండా బలవంతంగా సర్వేలు చేయిస్తుండటంతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వారంతా ఆందోళన బాట పడుతుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో ఉద్యోగుల ఐక్యవేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

గతంలో గడపగడపకు సేవలు

స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 2019 అక్టోబర్‌ 2 తేదీ గాంధీ జయంతి రోజున మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. అందులో భాగంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటికోసం ఊరూరా శాశ్వత ప్రభుత్వ భవనాలు నిర్మించి ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లారు. ఒక్కో సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ సర్వేయర్‌ ,అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌, ఉద్యాన శాఖ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, తదితర పోస్టులను నియమించారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు నేరుగా గడప వద్దకే చేర్చారు.

సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటింటికి తిరిగి సర్వేలు చేయలేమని ఇప్పటికే పలుసార్లు అధికారులను వేడుకుంటున్నా వారికి ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ప్రభుత్వ ఆశయం విజన్‌ 2047 సాకారం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేసే సమయంలో తీవ్ర అవమానానికి గురి కావాల్సి వస్తుందని, దీంతో ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, విద్యార్హతల ఆధారంగా విధులు అప్పగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మనమిత్ర, కౌసల్యం, పీ4, రైస్‌కార్డుల పంపిణీ, వాహన డేటా, ఆధార్‌ సీడింగ్‌, చైల్డ్‌ విత్‌ ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్ల వంటి వాటి కోసం ఇంటింటికి తిరిగి సర్వేలు చేయాల్సి ఉందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లు, క్యాడర్‌ మార్పు, ప్రమోషన్లు, పారదర్శక బదిలీలు వంటి వాటిని చేపట్టాలని కోరుతున్నా వాటిని తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement