
కాలేజీ ఫీజు కట్టకుండా.. జల్సాలకు ఖర్చు పెట్టి!
● తల్లిదండ్రులకు తెలియడంతో
మనస్తాపం
● గూడ్సు కింద పడి బీటెక్ విద్యార్థి
బలవన్మరణం
జూపాడుబంగ్లా: కుమారుడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడన్న ఆ తల్లిదండ్రుల కల చివరకు విషాదాంతమైంది. చెడు సావాసాలతో చెడు వ్యసనాలు తోడై ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కళాశాల ఫీజు జల్సాలకు ఖర్చు పెట్టిన బీటెక్ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్తూరు గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి, ఉషారాణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు జగదీశ్వరరెడ్డి (20) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం విద్య అభ్యసిస్తున్నాడు. రెండేళ్లపాటు బాగా చదువుకున్న యువకుడు తృతీయ ఏడాదిలోకి వచ్చే సరికి చెడు వ్యవసనాలు అలవర్చుకున్నాడు. కాగా ప్రతి నెల రమేష్‌రెడ్డి తిరుపతికి వెళ్లి కుమారుడి బాగోగులు చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండటంతో పదిరోజుల క్రితం ఇంటికి వచ్చిన కొడుకుతో ఫీజు ఇచ్చి పంపించాడు. అయితే ఫీజు కట్టలేదని కళాశాల నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన తిరుపతికి వెళ్లి కుమారుడిని విచారించారు. ఫీజు డబ్బులు ఖర్చు అయ్యాయని చెప్పినా.. వారు కుమారుడిని ఏమనకుండా త్వరలో ఫీజు చెల్లిద్దామని నచ్చజెప్పారు. తమతో పాటు ఊరికి రావాలని చెప్పగా.. ‘పని ఉంది మీరు వెళ్లండి నేను వెనుకాలే వస్తా’ అంటూ చెప్పడంతో వారు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. కాగా కుమారుడు ఇంకా రాకపోవడంతో ఆందోళన చెందుతుండగా తమ కుమారుడు ఇక లేడని సమాచారం అందింది. బుధవారం తెల్లవారుజామున నంద్యాల రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.