
బొలెరో విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ మహేంద్ర బొలెరో వాహనాన్ని విరాళంగా సమర్పించింది. శనివారం గంగాధర మండపం వద్ద వాహనం, సంబంధిత పత్రాలను బ్యాంకు చైర్మన్ పీవీకే ప్రమోద్‌కుమార్‌రెడ్డి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావుకి అందజేశారు. ముందుగా అర్చకులు వాహన పూజలు నిర్వహించారు. సుమారు రూ.11.50 లక్షలతో కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని దేవస్థానానికి అందజేసినట్లు ఏపీజీబీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పీవీ రమణ, శ్రీశైలం బ్రాంచ్ మేనేజర్ కె.సుబ్రమణ్యం సిబ్బంది పాల్గొన్నారు.
జీఎన్‌ఎం కోర్సులకు నోటిఫికేషన్
కర్నూలు(హాస్పిటల్): జీఎన్‌ఎం(జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరి) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. కోర్సులో చేరాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, సీట్ల లభ్యత వంటి వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్యాలయంలో స్వీకరిస్తారన్నారు.
పీఆర్‌లో ఐదుగురు డీడీఓలకు పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖలో ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. జిల్లాలోని గూడూరు ఎంపీడీఓ అశ్వినీకుమార్‌ను ప్రకాశం జిల్లా డ్వామా డీవీఓగా, ఓర్వకల్ ఎంపీడీఓ ఎం.శ్రీనివాసులును నంద్యాల జిల్లా డ్వామా ఏపీఓ (అకౌంట్స్)గా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే అనంతపురం జిల్లా గోరంట్లలో విధులు నిర్వహిస్తున్న పి.నరేంద్రకుమార్‌ను నంద్యాల డ్వామా ఏపీడీగా, విడపనకల్‌లో విధులు నిర్వహిస్తున్న షకీలాబేగంను డ్వామా డీవీఓగా, గాండ్లపెంటలో విధులు నిర్వహిస్తున్న బి.వెంకటరాముడును ఆత్మకూరు డ్వామా ఏపీడీగా పోస్టింగ్ ఇచ్చారు.