
నేడు శ్రీశైల ఆలయం మూసివేత
● చంద్ర గ్రహణం కారణంగా
ఉభయ దేవాలయాలు మూసివేత
శ్రీశైలంటెంపుల్: చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం వేకువజామున 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుందన్నారు. చంద్రగ్రహ ణం కారణంగా ఆదివారం మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం, అన్ని ఆర్జీతసేవలు, పరోక్షసేవలు, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేయబడుతుందన్నారు. ఆ రోజున భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని అన్నారు. అలాగే సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధారా పంచధారా, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు చేపడుతారన్నారు. అనంతరం 7.30 గంటలకు స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతులు నిర్వహించిన తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు ఆయా సమయ వేళల మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని దేవస్థాన ఈఓ పేర్కొన్నారు.
శ్రీశైల ఆలయం