
అన్నదానానికి బయోమెట్రిక్
● నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో కొత్త నిబంధన
బనగానపల్లె రూరల్: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణలోని నిత్యాన్నదాన సంస్థలో భక్తులు భోజనం చేయాలంటే ఇక నుంచి వేలి ముద్ర తప్పనిసరిగా వేయాల్సిందే. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారు. వారి సౌకర్యార్థం ప్రతి రోజు నిత్యాన్నదాన సంస్థలో మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సుమారు 150 – 200 మంది భక్తులు భోజనం చేస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ అధికారులు అన్నదాన సంస్థలో భోజనం చేయాల్సిన భక్తులు వేలిముద్ర తప్పనిసరి చేశారు. అయితే వేలిముద్ర వేసేందుకు ఒక క్యూలో, ఆ తర్వాత భోజనం కోసం మరో క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చాలా ఆలయాల్లో అన్నదానం కొనసాగుతున్నా ఎక్కడ బయోమెట్రిక్ విధానం లేదు. భక్తుల విరాళంతో నిర్వహించే ఉచిత అన్నదానాకి బయోమెట్రిక్ విధానం ఎందుకని భక్తులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరంగా అన్నదాన కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి బయోమెట్రిక్ విధానం అములులోకి తీసుకొచ్చామన్నారు. కాగా ఈ విషయంలో అధికారులు పునరాలోచన చేయాలని భక్తులు కోరుతున్నారు.

అన్నదానానికి బయోమెట్రిక్