
ఆందోళన బాటలో 104 ఉద్యోగులు
కర్నూలు (హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేయనున్నట్లు 104 అంబులెన్స్ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన యాజమాన్యం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ వారు గతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలను తగ్గించిందన్నారు. దీనిపై వివరణ అడుగగా మూడు నెలల నుంచి సరైన సమాధానం ఇవ్వడం లేదని, యాజమాన్యాన్ని కలవనివ్వటం లేదన్నారు. తమ సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు అనేక వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే మరింత ఉధృతం చేస్తామన్నారు. తగ్గించిన జీతాలు బకాయిలతో సహా ఇవ్వాలని, ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, పూర్వ సంస్థ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఔట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణి, ఇలియాస్, హాసన్, షరీఫ్, మంజుల, వినోద్, మల్లికార్జున, మధు, అజం ఉన్నారు.