
పాల ఉత్పత్తిదారుల అభ్యున్నతికి కృషి
● విజయ డెయిరీ చైర్మన్
ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): పాల ఉత్పత్తిదారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి( విజయ డెయిరీ) చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2024–25లో వార్షిక టర్నోవర్ రూ.319 కోట్లు ఉందని, దీనిని 2025–26లో రూ.393 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. విజయ డెయిరీ 38వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ పక్కన ఉన్న కర్నూలు డెయిరీ ప్రాంగణంలో చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎండీ ప్రదీప్‌కుమార్ వార్షిక నివేదికను చదవి వినిపించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ... ఈ ఏడాది 467 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు పాల ఉత్పత్తి పెంచడానికి తగి న చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఐదేళ్లుగా పాడిరైతులకు క్రమం తప్పకుండా బోనస్ చెల్లిస్తున్నామని, పాల సేకరణలో గిట్టుబాటు ధర లు కల్పిస్తున్నామని వివరించారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడిపశువుల కొనుగోలుకు సబ్సిడీ కూడా ఇస్తున్నామని వివరించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.