
రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం
● బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడుకు చెందిన భీమన్న, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వీరేంద్ర(29) కోవెలకుంట్ల పట్టణంలోని స్టార్విన్ టైలర్ షాపులో టైలర్‌గా పనిచేస్తున్నాడు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన నాగమణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. శుక్రవారం ఉదయం బైక్‌పై స్వగ్రామం నుంచి కోవెల కుంట్లకు బయలుదేరాడు. మార్గమధ్యలో భీమునిపాడు గ్రామం ఎస్సీ కాలనీ మలుపు వద్ద కోవెలకుంట్ల వైపు నుంచి మేకలను తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. యువకుడి మృతితో క్రిష్టిపాడులో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.