
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 62.4 మి.మీ వర్షం కురియగా డోన్‌లో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా శ్రీశైలంలో 55.4, నంద్యాల రూరల్‌లో 55.2, నంద్యాల అర్బన్, కొత్తపల్లెలో 54.2, పాములపాడులో 52.2, బండిఆత్మకూరులో 51.4, గడివేముల 48.4, పగిడ్యాల 46.8, మిడుతూరు 43.2, జూపాడుబంగ్లా 36.2, వెలుగోడు 26.8, మహానంది 24.6, నందికొట్కూరు 17.8, పాణ్యం 16.2, బేతంచెర్ల, సంజామల, గోస్పాడు 8.2, శిరివెళ్ల 7.2, ఆళ్లగడ్డ 6.0, అవుకు 5.2, కొలిమిగుండ్ల, చాగలమర్రి 4.2, రుద్రవరం 4.0, దొర్నిపాడు 3.2, బనగానపల్లె 3.0 మి.మీ వర్షం కురిసింది.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
పాములపాడు: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 3 గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి 25వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది. కాగా వీబీఆర్ (తెలుగుగంగ)కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ కింద రూ.22 కోట్ల నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి గోరుకల్లు రిజర్వాయర్‌ను నీటితో నింపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, సీఈ కబీర్, ఎస్‌ఈ శివకుమార్, ఈఈ కిష్టన్న, వెణుగోపాల్‌రెడ్డి, నాగేంద్ర కుమార్, డీఈ సుబ్రమణ్యరెడ్డి, నగేష్‌కుమార్, రవీంద్ర, ఆర్డీఓ నాగజ్యోతి, డీఎస్పీ రామాంజనేయులు నాయక్, తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్లీజ్.. పీ4 సభకు రండి!
ఉయ్యాలవాడ: బంగారు కుటుంబాల పేరుతో ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలకు స్పందన కరువైంది. శుక్రవారం మండలంలోని అల్లూరు గ్రామంలో గ్రామసభ 11 గంటలకు ప్రారంభం కావాల్సి వుండగా ప్రజలు ఎవరూ హాజరు కాలేదు. 11.30 సమయం దాటినా ఎవరూ గ్రామసభకు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ రహీమ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను గ్రామసభ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు వచ్చిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేద కుటుంబాలను అఽభివృద్ధి చేయడమే పీ4 కార్యక్రమం ధ్యేయమని వివరించారు. వచ్చిన 10 మందితో గ్రామసభ మమ.. అనిపించారు.
నిబంధనలు అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్‌లు రద్దు
శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణానదిలో మత్స్యకారులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రవికుమార్ హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం శ్రీశైలండ్యాం సమీపంలో అనధికారికంగా రెండు వర్గాలు చేపల వేటకు వెళ్లి పడవలపై తెడ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆయన లింగాలగట్టులో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా రాతపూర్వకంగా ఇస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. చేపలవేట నిషేధ కాలంలో వేట కొనసాగిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని, రద్దుచేసిన లైసెన్సు లు పునరుద్ధరించమని హెచ్చరించారు. సాధారణ రోజల్లో రిజర్వాయర్‌కు ముందు 150 మీటర్ల వరకు చేపలవేట సాగించరాదని ప్రభుత్వం జిఓ.నె. 186 తీసుకు వచ్చిందన్నారు. గత మంగళ వారం పరస్పర దాడులకు తెగబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని టూటౌన్ సీఐ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో మోస్తరు వర్షం