
గిరిజనుల అభివృద్ధికి కృషి
బండి ఆత్మకూరు: గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జీసీ పాలెం, నెమళ్లకుంట గిరిజన గూడెంలోని గిరిజనులకు ఇంటి సామగ్రి పంపిణీ చేశారు. పీ4 కార్యక్రమంలో భాగంగా గూడెంలోని 43 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల జీవన స్థాయిని మెరుగుపర్చేందుకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, హౌసింగ్ వంటి రంగాలపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్వేలు, ధ్రువపత్రాల పంపిణీ, భూమి హక్కుల రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాల్లో ఆయా శాఖలు సమన్వయంతో పనిచేసి వారికి భూ హక్కు పట్టాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివ ప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణవేణి, తహసీల్దార్ పద్మావతి, పంచాయతీ అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజకుమారి