
సార్.. ఎరువులు ఎక్కడ!
నంద్యాల(అర్బన్): ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండో నెల గడుస్తోంది. అదను.. పదును చూసుకొని రైతులు దుక్కులు దున్నారు. సమయానికి అందాల్సిన విత్తనాలు, ఎరువులు జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎరువుల కొరతతో పనులు మానుకుని రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూటమి నేతల ఇళ్లకు నేరుగా ఎరువులు చేర్చుతున్న అధికారులు సామా న్య రైతుల అవస్థలు పట్టించుకోవడం లేదు. కానాల గ్రామం పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం) పరిధిలోని రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. కానాల సొసైటీ పరిధిలో పెద్దకొట్టాల, పాండురంగాపురం, పొన్నాపురం, చాబోలు, అయ్యలూరు, రైతునగర్, కానాల తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు 2,500 మంది రైతులు, 6వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. కానాల పీఏసీఎస్ పరిధిలో దాదాపు 2,500 మెట్రిక్ టన్నుల డీఏపీ, 270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 84 మెట్రిక్ టన్నుల డీఏపీ, 110 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. వారం రోజులుగా ఎలాంటి ఎరువులు మంజూరు కాకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు. శుక్రవారం 400 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా సొసైటీ భవనం వద్దకు చేరుకొని అధికారులతో వాగ్వాదం చేశారు. అప్పటికే కూటమి నేతలకు పంపిణీ చేయడం, మిగిలినవి నచ్చిన వారికి ఇచ్చినట్లు తెలుసుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ పరిఽధిలో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్థానిక అధికారులను హెచ్చరించారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం చేతులెత్తేసిందని రైతులు చిన్నహుసేన్, వెంకటేశ్వర్లు, బాబు, షేక్ హుసేన్, కాశీం, తదితరులు విమర్శించారు.
రైతులను వేధిస్తున్న ఎరువుల కొరత
రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు
అధికారులను నిలదీస్తున్న రైతులు