
రోడ్డును దున్నేసి.. పంటను సాగు చేసి!
నంద్యాల(అర్బన్): కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. అసైన్డ్ భూములు, వాగులు, వంకలు ఆక్రమించిన వారు ఇప్పుడు దర్జాగా ఏకంగా ఆయకట్టు రోడ్డు తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైనమిది. నంద్యాల మండలం మేజర్ పంచాయతీ కానాల గ్రామంలో ఆయకట్టు రోడ్డుపై టీడీపీ నేత కన్నేశారు. నాలుగేళ్ల క్రితం రైతులంతా చందాలు వేసుకొని నిర్మించిన రోడ్డును దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో దున్ని కందిపంటను వేశారు. దశాబ్దాల క్రితం కానాల నుంచి కోవెలకుంట్లకు వెళ్లే రహదారిలో బైసాని కృష్ణమూర్తి, నంద్యాల పక్కీర్‌షా పొలాల మధ్యన హైస్కూల్ కొట్టాల, నాగులవరం వరకు పోరంబోకు రస్తా ఉంది. గతంలో కరణం నాగేశ్వరరావు పోరంబోకు స్థలాలకు పట్టా పుట్టించుకొని పత్తి నాగయ్య, తదితరులకు సీలింగ్ ల్యాండ్ కింద అమ్మకాలు జరిపారు. కాలక్రమేణ కొంత మంది ఆ రస్తాను ఆక్రమించి పొలాలు సాగుచేశారు. ఆయకట్టు రోడ్డు లేక స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామ రైతులు చర్చించుకుని 2021 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారంతా కలిసి 30 అడుగుల రహదారిని చందాలు వేసుకొని నిర్మించుకున్నారు. కేసీ కెనాల్ అధికారులు అక్కడక్కడ కల్వర్టులు ఏర్పాటు చేసి ఆయకట్టు రైతులు ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అప్పటి వరకు ఆక్రమణ దారుల్లో ఉన్న పోరంబోకు రస్తా ఆయకట్టు రోడ్డుగా మారింది. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక టీడీపీకి చెందిన నాయకుడు పిట్టల హనీఫ్ ఇటీవల ఆయకట్టు రోడ్డును దున్ని కంది పంట వేశారు. ఆయకట్టు రోడ్డులో పంటలు వేయడం ఏమిటని పలువురు రైతులు నిలదీస్తున్నా వారిని బెదిరిస్తున్నారు. దీంతో పరిష్కార వేదికలో కలెక్టర్‌కు సమస్యను విన్నవించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. టీడీపీ నాయకులకు ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడం పరిపాటిగా మారింది. అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తుండటంతో మరింత రెచ్చిపోతున్నారు.
కానాలలో టీడీపీ నాయకుడి నిర్వాకం
ఆయకట్టు రోడ్డు తమదేనంటూ
బెదిరింపు