
మేలైన యాజమాన్య పద్ధతులతోనే సాగులో రాణింపు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధాన ఉద్యాన పంటలైన ఉల్లి, మిరప, పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో రాణించవచ్చని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. గురువారం కర్నూలులోని ఉద్యాన భవన్‌లో ఆయా పంటల సాగుపై రైతులకు, గ్రామ ఉద్యాన సహాయకులు, ఉద్యాన సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మహానందిలోని హెచ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు హాజరై మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 25,122 హెక్టార్లలో ఉల్లి సాగువుతుందని, అయితే ఉత్పాదకతను పెంచడంలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. చక్కటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే హెక్టారుకు సగటున 150 క్వింటాళ్ల ఉత్పాదకతను పొందవచ్చన్నారు. మిరప సాగు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉందని.. నల్లతామర, వైరస్ తెగుళ్లను నివారించుకుంటే దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. మహానంది ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ ఉల్లి, పసుపు, మిరప సాగు పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ ఫిరోజ్ ఖాన్, ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ ప్రతినిధి శరవనన్, జిల్లాలోని ఉద్యాన అధికారులు అనూష, శ్రీవాణి, మదన్‌మోహన్‌గౌడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.