
ఎస్సార్బీసీకి జలకళ
కోవెలకుంట్ల: మూడు రోజుల క్రితం గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి విడుదల చేసిన నీరు బ్లాక్‌లకు చేరుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు వదిలిన నీరు బానకచర్ల మీదుగా ఎస్సార్బీసీకి విడుదలవుతున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎస్సార్బీసీ కాల్వలు కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయి. కోవెలకుంట్ల పట్టణ శివారులోని 10వ బ్లాక్ కాల్వకు నీరు చేరింది. కాల్వ పరీవాహక ప్రాంత రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, మినుము పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
లాటరల్ ఎంట్రీ స్పాట్
అడ్మిషన్లకు దరఖాస్తులు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఐవీసీ) అభ్యర్థుల నుంచి లాటరల్ ఎంట్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి.శైలేంద్రకుమా ర్ తెలిపారు. ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్స్ పాస్ అయిన విద్యార్థులు డిప్లొమోలోని మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో అడ్మిషన్ పొందుటకు అర్హులని తెలిపారు. సరైన ధ్రువపత్రాలతో ఈనెల 18వ తేదీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలన్నారు. 19వ తేదీన కర్నూలు పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీ కళాశాలలో జరుగే స్పాట్ అడ్మిషన్‌కు హాజరు కావాలన్నారు. సమాచారం కోసం 9912377723ను సంప్రదించాలన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం
కర్నూలు(అర్బన్): నగరంలోని సి.క్యాంప్ శారీరక వికలాంగుల (దివ్యాంగుల) బాలుర వసతిగృహంలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు ఇతర కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హాస్టల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి 100 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే బి.క్యాంప్‌లో రూ.2.86 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో నూతన వసతి గృహాన్ని కూడా నిర్మిస్తున్నామన్నారు. దరఖాస్తులను వసతి గృహ సంక్షేమాధికారికి అందించాలన్నారు. మరిన్ని వివరాలకు 08518– 277864ను సంప్రదించాలన్నారు.
17 టన్నుల ఎరువుల
విక్రయాలు నిలిపివేత
గోస్పాడు: మండల కేంద్రం గోస్పాడులోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి 17 టన్నుల ఎరువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపి వేశారు. గురువారం రాష్ట్రస్థాయి తనిఖీ బృందంలోని కమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు నరసింహారెడ్డి, విజిలెన్స్ ఎస్‌ఐ గోపాలుడు తదితరులు స్థానిక ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. కాగా శ్రీవెంకటసాయి ఫర్టిలైజర్స్ అండ్ ఫెర్టిసైడ్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. 9:24:24 ఎరువు మందును గుర్తించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దాదాపు రూ.8.13 లక్షల విలువైన 17.12 టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారి వెంట స్థానిక వ్యవసాయాధికారి స్వప్నికారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో మోస్త్తరు వర్షం
నంద్యాల(అర్బన్)/దొర్నిపాడు: నంద్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. బనగానపల్లె మండలంలో అత్యధికంగా 37.0 మి.మీ, జూపాడుబంగ్లా మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల అర్బన్‌లో 32.0, కోవెలకుంట్ల 31.4, కొలిమిగుండ్ల 30.0, ఆళ్లగడ్డ 29.6, బేతంచెర్ల 24.2, మహానంది 18.6, అవుకు 18.2, ఉయ్యాలవాడ 16.4, నంద్యాల రూరల్ 15.6, డోన్ 14.2, చాగలమర్రి 13.8, దొర్నిపాడు 11.2, ప్యాపిలి 6.8, సంజామల 6.4, గోస్పాడు 6.2, పాణ్యం 6.0, రుద్రవరం 4.2, బండిఆత్మకూరు 3.2, గడివేముల 2.2, వెలుగోడు 2.0, పగిడ్యాల 1.4 మి.మీ వర్షం కురిసింది. కుందూనదికి వరద నీరు పోటెత్తడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఎస్సార్బీసీకి జలకళ