
‘విభిన్న’ చిన్నారుల భవితకు భరోసా
● జిల్లాలో కొత్తగా 267 మంది
దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు
● వీరికి సమీప పాఠశాలల్లో అడ్మిషన్లు
జిల్లాలో పరిస్థితి ఇది..
జిల్లాలో భవిత కేంద్రాలు 29
ప్రత్యేక అవసరాల పిల్లలు 5369
భవిత కేంద్రాలకు వచ్చే వారు 555
హోం బెస్ట్ ఎడ్యుకేషన్
పొందుతున్న వారు 591
కేంద్రాల్లో ఐఈఆర్‌పీలు 58
ఆయాలు 29
ఫిజియో థెరపిస్ట్‌లు 08
నంద్యాల(న్యూటౌన్): విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు ఉజ్వల భవిత అందనుంది. జిల్లాలో మే 13 నుంచి జూన్ చివరి తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించి 267 మంది దివ్యాంగ విద్యార్థులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పధకాలు అందేలా జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు.
యూ–డైస్‌లో నమోదు
విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను మండల యూనిట్‌గా లెక్కించారు. జిల్లాలో ఇప్పటికే 5,369 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు కొత్తగా గుర్తించిన 267 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తూ ఆయా పాఠశాలల యూ–డైస్ కోడ్లో విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లల వాస్తవ గణాంకాల్లో పారదర్శకతతో పాటు వారు ఎక్కడ చదువుతున్నారనేది తెలుసుకునే అవకాశం ఉంది.
ఇళ్లకు వెళ్లి బోధన
ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 29 భవిత కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు 8 ఫిజియోథెరపిస్టులు చిన్నారులకు సేవలందిస్తున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులు కావటంతో వీరికి ఆటపాటలతో చదువులు చెప్పాల్సిన ఆవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన ఆట పరికరాలు, వస్తువులను కేంద్రాలకు సమకూరుస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలో ఇద్దరు ఇంక్లూజీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్‌లు (ఐఈఆర్‌పీలు) చిన్నారులకు విద్యను అందిస్తారు. వీరితో పాటు ప్రతి కేంద్రంలో ఒకరిని ఆయాగా నియమించారు. శారీరక వైకల్యం అధికంగా ఉన్న చిన్నారులకు ఇంటి వద్దనే ఆవనరమైన వైద్య సేవలు అందించేలా ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పాఠశాలకు వెళ్లని విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల ఇళ్లకు వెళ్లి ఐఈఆర్‌పీలు బోధన చేస్తారు.