
కష్టాలు వినలేదు.. వరాలు ఇవ్వలేదు
నందికొట్కూరు: మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవా కాలువకు నీటి విడుదల చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, ప్రజల కష్టాలు తెలుసుకోలేదు. ఇచ్చిన హామీలపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందారు. గురువారం మల్యాల ఎత్తిపోతలను సందర్శించి మోటార్లు ఆన్ చేసి కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన రైతు సభలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్ల, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత మంది ఎమ్మెల్యేలను వేదికపైకి ఆహ్వానించలేదు. ఆర్థిక శాఖ మంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడినట్లు కనిపించింది. సీఎం బాబు పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నార ని పొగడ్తలతో ముంచెత్తారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఒక మిడుతూరు మండలం ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించడంతో మిగతా మండలాల ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు కనబడటం లేదా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మండలానికి మాత్రమే ఎమ్మెల్యేనా అని.. సభకు వచ్చిన రైతులు, ప్రజలు మండిపడ్డా రు. నీటి ముంపు బాధితులకు సీఎం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి విస్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
టీడీపీ సభను తలపించిన రైతుసభ