
ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలి
గడివేముల: రైతుల నుంచి పొగాకు యాజమాన్యం కుదుర్చున్న ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని నంద్యాల – నందికొట్కూరు ప్రధాన రహదారిపై జీపీఐ కొనుగోలు కేంద్రం వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన పొగాకు రైతులు ధర్నా నిర్వహించారు. సాగు చేసే సమయంలో జీపీఐ కంపెనీ అధికారులు రైతుల నుంచి రూ 12 వేల నుంచి 18 వేల వరకు పొగాకు కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం రూ. 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం మోసం చేయడమేనన్నారు. పొగాకు రైతులను మోసం చేసిన జీపీఐ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. పొగాకు రైతులు ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.