కోర్టు కానిస్టేబుళ్ల పైసా వసూల్‌ ! | - | Sakshi
Sakshi News home page

కోర్టు కానిస్టేబుళ్ల పైసా వసూల్‌ !

Jul 17 2025 3:50 AM | Updated on Jul 17 2025 3:50 AM

కోర్టు కానిస్టేబుళ్ల పైసా వసూల్‌ !

కోర్టు కానిస్టేబుళ్ల పైసా వసూల్‌ !

● పెట్టి కేసుల్లో చేతివాటం ● వందల్లో ఫైను ఉంటే వేలల్లో వసూలు చేస్తున్న వైనం ● న్యాయవాదులతో ఒప్పందం కుదుర్చుకుని బేరసారాలు ● సొంత పొలాల్లో, ఇంటి ఆవరణలో మద్యం సేవిస్తున్నా వదలని పోలీస్‌ బృందాలు ● అధికారులకు కూడా వాటా ఉందంటూ గుసగుసలు

ఆళ్లగడ్డ: కోర్టు కానిస్టేబుళ్లు కొందరు వసూల్‌ రాజాలుగా మారిపోయారు. నిత్యం వేల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నారు. తెలిసో తెలియక చిన్నపాటి పొరపాటుతో దొరికిన నిందితులే టార్గెట్‌గా ఇష్టారీతిన డబ్బు గుంజుతున్నారు. పెట్టి కేసులకు సెక్షన్ల ప్రకారం న్యాయమూర్తులు విధించే ఫైన్ల కంటే కొందరు కానిస్టేబుళ్ల ‘పైసా వసూలే’ ఎక్కువవుతోంది. ఈ వ్యవహారం అంతా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ తెలిసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే పెట్టి కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు పెట్టి కోర్టుకు హాజరు పరుస్తారు. నిందితులందరినీ కోర్టు కానిస్టేబుల్‌ ద్వారా కోర్టుకు పంపుతారు. జడ్జి వారిని నేరుగా విచారించి రూ.100 నుంచి రూ.10 వేల వరకు జరి మానా విధిస్తారు. ఆ జరిమానాను అక్కడే కోర్టులో చెల్లించి రసీదు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

మధ్యవర్తుల అవతారం

కోర్టు కానిస్టేబుళ్లు కొందరు కేసులను అమ్ముకునే వ్యాపారం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, హత్య, హత్యాయత్నం, ఇతర క్రిమినల్‌ కేసుల్లో నిందితలను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో దూరప్రాంతాలకు చెందిన వారు నిందితులుగా ఉంటే కోర్టు కానిస్టేబుళ్ల దందా మూడు పూవ్వులు.. ఆరు కాయలే. ఇతర ప్రాంతాలకు చెందిన నిందితులకు ఇక్కడి న్యాయవాదుల గురించి అవగాహన ఉండదు. దీంతో కోర్టు కానిస్టేబుళ్లే మధ్యవర్తులుగా మారిపోతున్నారు. ఇందుకోసం ఇటు నిందితుల నుంచి అటు లాయర్ల నుంచి డబుల్‌ బొనంజా పొందుతున్నారు.

రోజుకు 10 కేసులు..

ఒక్కొక్కరి నుంచి రూ.1,600

ఆళ్లగడ్డ రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ప్రతి రోజు 10 పెట్టి కేసులు తేవాల్సిందే అని సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఇందుకోసం రెండు టీంలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు సాయంత్రం గ్రామాల్లో తిరుగుతూ ఉండాలి. ఎవరూ దొరక్కపోతే పొలాల్లో కూర్చుని మద్యం తాగుతున్న వారినైనా పట్టుకుని పెట్టి కేసు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సంబంధిత కోర్టు కానిస్టేబుల్‌ కోర్టుకు వచ్చే సమయంలో ఒక్కొక్కరు రూ.1600 తెచ్చుకోవాలని నిందితులకు చెబుతాడు. వారు ఆ మొత్తాన్ని కానిస్టేబుళ్‌కు ఇవ్వడం జరుగుతోంది. అతను వారిని కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.500 జరిమానా పడుతుంది. మిగతాది ఒక్కొక్కరికి రూ.1,100 చొప్పున 10 మందికి రూ.11 వేలు ఆ కానిస్టేబుళ్‌ జేబులో వేసుకుంటున్నారని సహచర కానిస్టేబుళ్లే ఆరోపించడం గమనార్హం. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 3.30 లక్షలు అవుతుందని, అంటే ఎడాదికి ఎంత అవుతుందో అని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రసీదు రూ.600 వసూలు రూ.10 వేలు

శిరివెళ్ల సర్కిల్‌ పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కొంత కాలం క్రితం వాహనాల చెకింగ్‌ చేస్తుండగా రుద్రవరానికి చెందిన ఓ డ్రైవర్‌ డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడ్డాడు. మరుసటి రోజు అతనితో పాటు సుమారు 20 మందిని కలిపి కోర్టులో హాజరు పరచగా జడ్జి జరిమానా విధించారు. జరిమానా చెల్లించేందుకు వెళ్లిన నిందితులతో సంతకం మాత్రం తీసుకున్నారు. సంతకం చేసే సమయంలో చూస్తే అందులో రూ.600 మాత్రమే రాసి ఉందని, తమతో మాత్రం ఒక్కొక్కరితో రూ.10 వేలు తీసుకున్నారని నిందితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే కేసులో కాస్త పలుకుబడి ఉన్న కొందరిని కోర్టుకు హాజరుకాకపోయినా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేస్‌ క్లోజ్‌ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెట్టి కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్లు గూగుల్‌ పే, ఫోన్‌ పే కాకుండా కేవలం క్యాష్‌ మాత్రమే తీసుకుంటుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement