
మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించాలి
బనగానపల్లె: ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను కత్తెర (గొంగలి) పురుగు ఆశించిందని, దీని వల్ల పంటకు నష్టం వాటిళ్లుతుందని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కత్తెర పురుగు నివారణ చర్యలను వివరించారు. కత్తెర పురుగు మొదటి దశలో ఆకులపై పత్ర హరితాన్ని గీకి తింటూ రంద్రాలను చేస్తుంది. పురుగు పెరిగే కొద్ది ఆకుల చివర నుంచి తింటూ కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తుంది. దీన్నుంచి పంటను కాపాడుకునేందుకు పంట చుట్టూ నాలుగు వరసలు నేపియర్ గడ్డిని ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాన్ని గుర్తించి ఏరి నాశనం చేయాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకో గ్రామ బదనికలను ఎకరానికి 20 వేలు చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి ఒక లీటరు వేప నునెను 5 శాతం వేపగింజల కాశాయాన్ని పిచికారీ చేయాలని చెప్పారు. తొలి దశ గొంగలి పురుగులను నివారించేందుకు ఎకరానికి 500 మి.లీ. క్లోరోఫైరోఫాస్ లేదా 400 మి.లీ. క్వినల్‌పాస్ మందును పిచికారీ చేయాలని, ఎదిగిన గొంగలి పురుగు నివారణకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, రెండులీటర్ల నీరు కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమానికి 100 గ్రాములు థయోడికార్బ్ మందును జోడించి సాయంత్రం వేళ చుడుల్లో వేయాలన్నారు. ఈ పద్ధతి వల్ల పంటకు జరిగే నష్టాన్ని నివారించవచ్చని వివరించారు.